భగవద్గీత !

!! తృతీయ అధ్యాయము !!

! కర్మయోగము - శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో

 

 



||ఓమ్ తత్ సత్ ||
అర్జున ఉవాచ:
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్ జనార్దన|
తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ||

"ఓ కృష్ణా జ్ఞానము కర్మము కంటే శ్రేష్ఠమైనది అని నీ అభిమతమైతే మరి ఈ భయంకరమైన కర్మ లో నన్ను ఎందుకు ప్రవర్తింపచేయుచున్నావు"

భగవద్గీత
కర్మయోగము
మూడవ అధ్యాయము
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

"నహి కశ్చిత్ క్షణమపి" - అంటే ఒక్క క్షణముకూడా కర్మ అంటే పని చేయకుండా ఉండలేము అంటూ
ఈ అధ్యాయమంతా కర్మ సంబంధమైన విషయాలతో నిండినది.
కర్మ సంబంధమైన విషయాలు అంటే కర్మ ఎందుకు చెయ్యాలి,
ఎటువంటి కర్మ చెయ్యాలి, చెయ్యకపోతే ఏమి అవుతుంది, చేస్తే ఏమి అవుతుంది,
అన్నీతెలిసికూడా మనుష్యుడు ఎందుకు తప్పుడు కర్మ చేస్తాడు అన్నవిషయాలన్నమాట.

అన్నీ కర్మ సంబంధమైన విషయాలు కాబట్టి దీనిని కర్మ యోగము అన్నారు.

ఈ అధ్యాయము అర్జునుని ప్రశ్న తో ప్రారంభము అవుతుంది.

అర్జున ఉవాచ:
జ్యాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1 ||

స|| హే జనార్దన ! బుద్ధిః కర్మణః జ్యాయసీ (ఇతి) తే మతాచేత్ తత్ కేశవా ! మాం ఘోరే కర్మణి కిం నియోజయసి ?||1||

||శ్లోకార్థములు||

బుద్ధిః కర్మణః జ్యాయసీ - జ్ఞానము కర్మ కంటే శ్రేష్ఠమైనది
(ఇతి) తే మతాచేత్ -- (అని) నీ అభిప్రాయమైతే
మాం ఘోరే కర్మణి - నన్ను ఘోరమైన ( యుద్ధమనే) కర్మలో
కిం నియోజయసి - ఎందువలన ప్రవర్తింప చేస్తున్నావు?

||శ్లోకతాత్పర్యము||

అర్జునుడు చెప్పుచున్నాడు:
"ఓ కేశవా, జ్ఞానము కర్మ కంటే శ్రేష్ఠమైనది అని నీ అభిప్రాయమైతే,
నన్ను ఘోరమైన యుద్ధమనే కర్మలో ఎందువలన ప్రవర్తింప చేస్తున్నావు?" ||1||

" ఓ కృష్ణా ! 'బుద్ధిః కర్మణా జ్యాయసీ చేత్'
అంటే బుద్ధి యోగము లేక జ్ఞానయోగము కర్మ యోగముకన్నా శ్రేష్ఠమైనది అని నీ అభిప్రాయమైతే,
నన్ను ఎందుకు ఈ కర్మతో కూడిన ఘోరమైన యుద్ధము చేయమంటావు " అని.

ఈ ప్రశ్నకు కారణము సాంఖ్యయోగములో కృష్ణుడు చెప్పిన మాటలే.

సాంఖ్యయోగములో ముందు జ్ఞానయోగము ఆత్మను గురించి ఉపదేశించి,
తరువాత నిష్కామ కర్మగురించి ప్రశంసాత్మకముగా చెప్పి,
మరల స్థితప్రజ్ఞుని లక్షణములు ఇంద్రియ నిగ్రహ సాధనములు చెప్పి,
చివరి శ్లోకాలలో బ్రాహ్మీ స్థితిని, జ్ఞాన అనుభవమును వర్ణించి చెప్పుట వలన
జ్ఞానయోగమే శ్రేష్ఠము అని అనిపించవచ్చు.

కానీ అర్జునిడితో మాత్రము 'కర్మణ్యేవాధికారః తే'
అంటే 'నీ కు కర్మలయందే అధికారముంది.
కర్మలు చేయకుండా ఉండడములో నీకు ప్రీతి కలుగనీయకు' అని
కర్మ చేయడమే కర్తవ్యము అని కుండ బద్దలికొట్టినట్టు చెప్పాడు.

భక్తుల శ్రేయస్సుకి సాంఖ్యబుద్ధిని సాధనముగా చెప్పి
తనకు కర్మలు చేయమంటే అర్జునిడికి కలత రావడము సహజమే

ఆందుకనే అర్జునుడు
' ఓ జనార్దనా!కర్మల కంటే జ్ఞానమే శ్రేష్టమని నీ అభిప్రాయమైతే
మరి నాకెందుకీ ఘోరమైన కర్మ విధిస్తున్నావు' అని అడుగుతాడు.

అంతే కాదు అర్జునుడు మళ్ళీ ఇంకా అంటాడు -

||శ్లోకము 2||

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ||2||

స|| వ్యామిశ్రేణేవ వాక్యేన మే బుద్ధిం మోహయశీవ | అహం యేన శ్రేయః ఆప్నుయామ్ తదేకం నిశ్చిత్య వద ||2||

||శ్లోకార్థములు||

వ్యామిశ్రేణేవ వాక్యేన - మిశ్రమమైనదానివలె నున్న వాక్యములతో
మే బుద్ధిం మోహయసీవ - నా బుద్ధికి భ్రాంతి కలిగిస్తున్నట్లు వున్నావు
అహం యేన శ్రేయః ఆప్నుయామ్ - నేను దేని చేత శ్రేయస్సు పొందగలనో
తదేకం నిశ్చిత్య వద - అది ఒక్కటే నిశ్చయించి చెప్పుము

||శ్లోకతాత్పర్యము||

"మిశ్రమమైనదానివలె నున్న వాక్యములతో నా బుద్ధికి భ్రాంతి కలిగిస్తున్నట్లు వున్నావు.
నేను దేని చేత శ్రేయస్సు పొందగలనో అది ఒక్కటే నిశ్చయించి చెప్పుము". ||2||

"తదేకమ్ వద" అంటే ఏదో ఒక్కటే చెప్పు. అంటే ఏది?
"ఏదైతే నాకు నిశ్చయముగా శ్రేయస్సు కలిగించునో అదొక్కటే చెప్పు"!!
కృష్ణుడు జ్ఞానయోగము ( సాంఖ్యయోగము) , అలాగే కర్మయోగము చెప్పాడు రెండవ అధ్యాయములో.
ఈ రెండిటిలో దేని చేత శ్రేయస్సు పొందగలనో అది మాత్రము చెప్పు అని అర్జునిని కోరిక.

"కార్పణ్యదోషోపహతస్వభావః' అంటూ తన మానసిక స్థితిని అని రెండవ అధ్యాయములో వెళ్ళడి చేసిన అర్జునుడు, ఇక్కడ "వ్యామిశ్రేణేవ వాక్యేన" అంటూ కృష్ణుని మాటలు పూర్తిగా అవగాహన కాని విషయము వెళ్ళడిస్తాడు.

||శ్లోకము 3||

శ్రీ భగవానువాచ:
లోకేశ్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || 3||

స|| హే అనఘ ! పురా అస్మిన్ లోకే మయా సాంఖ్యానాం జ్ఞానయోగేన యోగినామ్ కర్మయోగేన నిష్ఠా ద్వివిధా ప్రోక్తా ||3||

||శ్లోకార్థములు||

అనఘా- పాపరహితుడవైనవాడా (అర్జునా)
పురా అస్మిన్ లోకే - పూర్వము ఈ లోకములో
మయా సాంఖ్యానాం జ్ఞానయోగేన - నాచేత సాంఖ్యులకు జ్ఞానయోగము చేతను
యోగినామ్ కర్మయోగేన - యోగులకు కర్మయోగము చేతను
నిష్ఠా ద్వివిధా ప్రోక్తా - రెండువిధములైన అనుష్ఠాన మార్గములు చెప్పబడినవి

||శ్లోకతాత్పర్యము||

'ఓ పాపరహితుడవైన అర్జునా, పూర్వము ఈ లోకములో
నా చేత సాంఖ్యులకు జ్ఞానయోగము చేతను, యోగులకు కర్మయోగము చేతను
రెండువిధములైన అనుష్ఠాన మార్గములు చెప్పబడినవి."||3||

ఈ శ్లోకములో మొదటి మారు, 'మయా' అంటే 'నాచేత చెప్పబడిన" అన్నమాటతో,
కృష్ణుడు భగవత్స్వరూపుడు అన్నమాట నేపధ్యములో వినిపిస్తుంది.

"ఓ అర్జునా నాచేత పూర్వములో రెండు విథములగు అనుష్ఠాన క్రమములు చెప్ప బడినవి.
ఒకటి జ్ఞానమార్గము పై పోవువారికి జ్ఞానయోగము
రెండవది కర్మమార్గము పై పోవువారికి కర్మయోగము అని"

అంటే రెండు మార్గములు ఉన్నాయి అని.

ఇది చాలా ముఖ్యమైన మాట.
ఎందుకు అంటే తత్త్వ విచారణలో కొంతమంది
రెండూ ( జ్ఞాన కర్మయోగాలు) కలిపి ఒకటే మార్గము అని వాదించే వారుంటారు.
కాని భగవద్గీతలో వీటికి గమ్య స్థానము ఒకటే అయినా
ఇవి రెండు వేరే మార్గాలు అని ఇక్కడ భగవానుడు నిశ్చయముగా చెప్పినట్టే.

కొందరు తత్వ విచారణ యందు ఆశక్తి కలిగి ఉంటారు.
వారు జ్ఞాన యోగులు .

కొందరు కర్మ యందు ఆశక్తి కలిగి ఉంటారు .
వారిని కర్మయోగులని చెప్ప వచ్చును.
అందరికీ ఒకటే మార్గమని లేదు.
ఒకడే రెండు మార్గములు అవలంబించవలెను అని కూడా కాదు.

కర్మ యోగములో కూడా మళ్ళీ కర్మ అంటే ఏమిటి అన్న ప్రశ్న ముఖ్యము.

కర్మలో కామముతో చేసేకర్మలు ,
కామము లేకుండా చేసే కర్మలు ఉంటాయి.
కామముతో చేసే కర్మలు చెడు కర్మలు.
కామము లేకుండా చేసే కర్మలు మనస్సుని మంచి మార్గములో పెట్టు మంచి కర్మలు అనవచ్చు.

అసలు కర్మలే చెయ్యకపోతే చెడు కర్మలు ఉండనే ఉండవు కదా అని,
కర్మత్యాగము గురించి మనకు ఆలోచనలు రావచ్చు. ఈ ప్రశ్నలకి సమాధానము వింటాము.

||శ్లోకము 4||

నకర్మణా మనారమ్భాత్ నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే |
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||4||

స||పురుషః కర్మణానాం అనారమ్భాత్ నైష్కర్మ్యం న అశ్నుతే | (కర్మ) సన్న్యసనాత్ ఏవ సిద్ధిమ్ న చ సమధిగచ్చతి ||4||

||శ్లోకార్థములు||

పురుషః కర్మణానాం అనారమ్భాత్ - పురుషుడు కర్మలను ఆచరించకుండా
నైష్కర్మ్యం న అశ్నుతే - కర్మబంధనములనుంచి ముక్తి పొందడు
సన్న్యసనాత్ ఏవ - కర్మ సన్న్యాసము మాత్రవలననే
సిద్ధిమ్ న చ సమధిగచ్చతి - మోక్షమును పొందనే పొందడు గదా

||శ్లోకతాత్పర్యము||

"పురుషుడు కర్మలను ఆచరించకుండా కర్మబంధనములనుంచి ముక్తి పొందడు.
కర్మ సన్న్యాసము మాత్రవలననే మోక్షమును పొందనే పొందడు గదా".||4||

కృష్ణుడు కర్మయోగము గురించి చెపుతూ కర్మ త్యాగము చేయడముతో ,
అంటే కర్మ చేయకుండా ఉండడము వలన, మనుష్యుడు సిద్ధిపొందడు.
నిష్కామకర్మ వలనే సిద్ధి పొందును అని చెపుతాడు.
ఆ విథముగా కృష్ణుడు కర్మత్యాగాన్నిఅనుమానం లేకుండా నిషేధిస్తాడు.(3.04)

ఇక్కడ నైష్కర్మ్యం అనడములో - కర్మ చేయక్కరలేని స్థితిని అని. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది ?
అత్మానుభవము వచ్చినవాడికి ఆ స్థితి వస్తుంది.
కర్మబంధములనుంచి ముక్తి పొందినవాడు కూడా కర్మ చేయనక్కరలేని స్థితికి చేరినవాడే.
మోక్షము పొందినవాడు కూడా కర్మ చేయనక్కరలేని స్థితికి చేరినవాడే.
కృష్ణుడు చెప్పడము, కర్మ చేయకుండా, కర్మ చేయనక్కరలేని స్థితికి చేరవు అని.

||శ్లోకము 5||

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్|
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః || 5||

స|| కశ్చిత్ జాతు క్షణమపి అకర్మకృత్ న హి తిష్ఠతి | హి ప్రకృతిజైః గుణైః సర్వః అవశః కర్మ కార్యతే ||5||

||శ్లోకార్థములు||

కశ్చిత్ జాతు క్షణమపి - ఎవరును ఒకప్పుడు క్షణకాలము కూడా
అకర్మకృత్ న హి తిష్ఠతి - కర్మ చేయకుండా ఉండలేడు కదా
ప్రకృతిజైః గుణైః - ప్రకృతివలన పుట్టిన గుణములతో
సర్వః అవశః కర్మ కార్యతే - ప్రతివాడును అవశ్యముగా కర్మలను చేయుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరును ఒకప్పుడు క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండలేడు కదా.
ప్రకృతివలన పుట్టిన గుణములతోప్రతివాడును అవశ్యముగా కర్మలను చేయుచున్నాడు". ||5||

ఇంకా చెపుతూ ప్రకృతి వలన పుట్టుకతో వచ్చిన, పుట్టిన గుణములవలన
ఏ వ్యక్తి కర్మ చేయకుండా ఒక క్షణము కూడా కూడా ఉండలేడు.
జ్ఞాని తప్ప మిగిలినవారందరికి ఇది వర్తిస్తుంది.
ప్రకృతి వలన వచ్చిన గుణములు కాబట్టి మనము ఏమీ చేయలేము అన్నమాట లేదు.
గుణములను వశములో తీసుకురాగలిగినప్పుడు గుణములను అధిగమించడము కూడా అవవచ్చు.
కృష్ణుడు అర్జునుడికి - నిస్త్రైగుణ్యో భవ (2.45), అంటూ చెప్పడములో ఇదే అర్థము.

||శ్లోకము 6||

కర్మేంద్రియాణి సంయమ్య య అస్తే మనసా స్మరన్|
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే ||6||

స|| యః కర్మేంద్రియాణి సంయమ్య మనసా ఇంద్రియార్థాన్ స్మరన్ ఆస్తే సః విమూఢాత్మా మిథ్యాచారః ఉచ్యతే ||6||

||శ్లోకార్థములు||

యః కర్మేంద్రియాణి సంయమ్య - ఎవరు కర్మేన్ద్రియములను నియంత్రములో పెట్టి
మనసా ఇంద్రియార్థాన్ స్మరన్ అస్తే - మనస్సులో ఇన్ద్రియవిషయములను చింతించుచు ఉన్నాడో
సః విమూఢాత్మా - ఆ అవివేకము గలవాడు
మిథ్యాచారః ఉచ్యతే - కపటమైన ఆచరణకలవాడని చెప్పబడుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు కర్మేన్ద్రియములను నియంత్రములో పెట్టి, మనస్సులో ఇన్ద్రియవిషయములను చింతించుచు ఉన్నాడో, అట్టి వివేకశూన్యమైన మనస్సు గలవాడు కపటమైన ఆచరణకలవాడని చెప్పబడుచున్నాడు".||6||

ఇన్ద్రియములకు స్వతః తమ విషయములను తెలిసికొను శక్తిగాని అనుభవించు శక్తికాని లేదు. మనస్సు వాటితో చేరినపుడే ఆ యా శక్తులు వాటికి ఏర్పబడును. అందుకని ఇన్ద్రియములను అణచి పెట్టినంతమాత్రమున ప్రయోజనముండదు. శుచి అయిన స్థానము ఏర్పరచుకొని, సరి అయిన ఆసనములో కూర్చుని రామ రామా అంటూ వాక్కుతో ధ్యానము చేసినా, మనస్సు ఎక్కడెక్కడో విహరిస్తుంటే అది ధ్యానము కాదు. అది మిధ్యా ధ్యానము అని, ఈ శ్లోకము లో చెప్పబడిన మాట.

ఇంకొక విషయము.
కర్మ త్యాగముకన్నా కర్మ చేయటమే మేలు.
కర్మ చేయకపోతే చిత్తశుద్ధి కలగదు.
చిత్తశుద్ధిలేకపోతే జ్ఞానము అంకురించదు.
జ్ఞానము లేకపోతే మోక్షము ఉండదు.
అందుకని కర్మ చేయవలసినదే.

||శ్లోకము 7||

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున |
కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే ||7||

స|| హే అర్జునా! యస్తు ఇంద్రియాణి మనసా నియమ్య కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః ఆరభతే సః విశిష్యతే ( శ్రేష్ఠః భవతి)||7||

||శ్లోకార్థములు||

యస్తు ఇంద్రియాణి మనసా నియమ్య - ఎవరైతే ఇన్ద్రియములను మనస్సుతో నియమములో వుంచి
కర్మేంద్రియైః కర్మయోగం - కర్మేన్ద్రియములతో కర్మ యోగమును
అసక్తః ఆరభతే - సంగము లేకుండా ఆరంభించుచున్నాడో
సః విశిష్యతే -అతడు శ్రేష్ఠుడు అగును.

||శ్లోకతాత్పర్యము||

"ఎవరైతే ఇన్ద్రియములను మనస్సుతో నియమములో వుంచి కర్మేన్ద్రియములతో కర్మ యోగమును
సంగము లేకుండా ఆరంభించుచున్నాడో, అతడు శ్రేష్ఠుడు అగును". ||7||

ఇది కర్మయోగ అనుష్ఠానమంత్రము. అంటే కర్మయోగము ఎలా చెయ్యాలి అని చెప్పే శ్లోకము. కర్మయోగము అనుసరించే వారికి ఇది మార్గము.

ఇక్కడ చెప్పినది, ఎవడు ఇంద్రియములను మనస్సుచే నియమించి అంటే తన అధీనములో ఉంచి ,
వానిచే మోహము లేని వాడై , కర్మని ఆచరించునో అతడు ఉత్తముడు అని(3.07).
ఇక్కడ ముఖ్యమైన మాట ఇన్ద్రియములను మనస్సుతో నియమములో ఉంచడము. మనస్సు నియంత్రణ లో లేనంతకాలము అది మిధ్యాచరణము అంటే కపటమైన ఆచరణ అని ముందు శ్లోకములో చెప్పబడినది.

||శ్లోకము 8||

నియతం కురుకర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః ||8||

స|| త్వం నియతం కర్మ కురు | అకర్మణః కర్మ జ్యాయో హి | అకర్మణః తే శరీర యాత్రా అపి చ న ప్రసిద్ధ్యేత్ ( భవతి) ||8||

||శ్లోకార్థములు||

త్వం నియతం కర్మ కురు - నీవు నియమింపబడినట్టి కర్మ చేయుము
అకర్మణః కర్మ జ్యాయో హి - కర్మచేయకుండా వుండడము కన్నా కర్మ చేయడమే శ్రేష్ఠమైనది
అకర్మణః- కర్మచేయకుండా వుండడము వలన
తే శరీర యాత్రా అపి చ న ప్రసిద్ధ్యేత్ - నీ దేహ యాత్ర కూడా సిద్దింపనేరదు

||శ్లోకతాత్పర్యము||

"నీవు నియమింపబడినట్టి కర్మ చేయుము. కర్మచేయకుండా వుండడము కన్నా కర్మ చేయడమే శ్రేష్ఠమైనది.
కర్మచేయకుండా వుండడము వలన నీ దేహ యాత్ర కూడా సిద్దింపనేరదు కదా". ||8||

కర్మ త్యాగముకన్నా కర్మ చేయటమే మేలు.
ఎందుకు? కర్మ చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధిలేకపోతే జ్ఞానము అంకురించదు. జ్ఞానము లేకపోతే మోక్షము ఉండదు.

ఇంకొక మాట కర్మ చేయక పోతే ఈ దేహ యాత్ర కూడా సాగదు.
అందుకని కర్మ చేయవలసినదే !

అయితే ఎలాంటి కర్మ చెయ్యాలి?
"నియత కురు కర్మత్వం"- (3.08)
"శాస్త్ర నియతమగు కర్మ చేయవలెను".

'శాస్త్ర నియతమగు కర్మ", అన్నది కూడా కొంచెము సందిగ్ధమే. ఏ శాస్త్రము అన్న ప్రశ్నరావచ్చు.

శాస్త్రనియతమైన కర్మ అంటే భగవత్ప్రీతికరమైన, లోకహితముకొఱకు చేయు పనియే నియత కర్మ.

హోమము, తర్పణము (పితృతర్పణము), అతిధి పూజ, బ్రహ్మ యజ్ఞము, వేదాధ్యయనము,
ప్రాణులకు అన్నము ఇచ్చుట. ఇవన్నీ భగవత్ ప్రీతికరమైనవి. ఇవి నియత కర్మలు అని చెప్పవచ్చు,
ఇవి బంధము కలుగ జేయవు.

ఇంకా చిన్నది గా చెప్పలంటే లోక హితము కొఱకు చేయు కర్మ, నియత కర్మ.

||శ్లోకము 9||

యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః|
తదర్థమ్ కర్మ కౌన్తేయ ముక్తసఙ్గః సమాచర ||9||

స||హే కౌన్తేయ ! యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర అయం లోకః కర్మబన్ధనః | తదర్థమ్ ( యజ్ఞార్థాత్) కర్మ ముక్తసంగః సమాచర ||9||

||శ్లోకార్థములు||

యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర- యజ్ఞముకొఱకై చేసే కర్మ కన్నాఇంకొక కర్మచేత
అయం లోకః కర్మబన్ధనః - ఈ లోకులు కర్మచే బంధింపబడుచున్నారు
తదర్థమ్ ( యజ్ఞార్థాత్) - అందుకోసము అంటే ఆ యజ్ఞము కొఱకు
ముక్తసంగః సమాచర - సంగము విడిచినవాడై బాగుగా( కర్మ) చేయుము

||శ్లోకతాత్పర్యము||

"యజ్ఞముకొఱకై చేసే కర్మ కన్నాఇంకొక కర్మచేత ఈ లోకులు కర్మచే బంధింపబడుచున్నారు.
అందుకోసము అంటే ఆ యజ్ఞము కొఱకు సంగము విడిచినవాడై బాగుగా( కర్మ) చేయుము". ||9||

అట్టి కర్మే యజ్ఞము కూడా.
అట్టి కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయవలెను.
భగవంతుని కొఱకు చేయబడిన కర్మలు యజ్ఞములు.
ఆ కర్మలే (యజ్ఞము అనబడినప్పటికీ) ఫలాపేక్షతో చేసితే బంధాలు (3.9).

||శ్లోకము 10||

సహయజ్ఞాః ప్రజాస్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేషవోఽస్త్విష్ఠ కామధుక్ || 10||

స|| ప్రజాపతిః పురా యజ్ఞాః సహ ప్రజాః సృష్ట్వా అనేన ( యజ్ఞేన) ప్రసవిష్వధ్వమ్, ఏషః వః ఇష్టకామధుక్ అస్తు (ఇతి)ఉవాచ ||10||

||శ్లోకార్థములు||

ప్రజాపతిః పురా - పూర్వకాలములో ప్రజాపతి
యజ్ఞాః సహ ప్రజాః సృష్ట్వా - యజ్ఞముతో కూడా ప్రజలను సృష్ఠించి
అనేన ( యజ్ఞేన) ప్రసవిష్వధ్వమ్- దీని చేత వృద్ధిని పొందుడు
ఏషః వః ఇష్ట కామధుక్ - ఇది మీకు ఇష్టమగు కోరికలను
అస్తు (ఇతి)ఉవాచ - ఇచ్చుగాక అని చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"పూర్వకాలములో ప్రజాపతి యజ్ఞముతో కూడా ప్రజలను సృష్ఠించి దీని చేత వృద్ధిని పొందుడు.
ఇది మీకు ఇష్టమగు కోరికలను ఇచ్చుగాక అని చెప్పెను". ||10||

ఆ యజ్ఞము అన్నమాటగురించి చెపుతూ కృష్ణుడు ఇట్లా అంటాడు.
"సృష్ఠిలోనే బ్రహ్మ ప్రజలతో సహా, ప్రజలకోరికలు తీర్చుమార్గముగా, యజ్ఞములను సృష్ఠించెను" అని.

ఆ యజ్ఞములను చేయుచూ ప్రజలు దేవతలనూ ,
దేవతలు ప్రజలనూ తృప్తి పరచుచూ,
ఉత్తమ స్థాయిలో శ్రేయస్సు పొందగలరు అని" (అని బ్రహ్మ ఆదేశము!).(3.10,11)

ఇక్కడ యజ్ఞము అంటే భగవంతుని గురించి గాని, పరోపకార సంబంధమైనట్టిది గాని, 'లోకసంగ్రహము" కోసము గాని చేసే కర్మలు.
ఈ యజ్ఞము అన్నమాటకి, వేదములలో యజ్ఞము పేరిట చెప్పబడిన ( చాతుర్మాస్య యజ్ఞము) కామ్యకర్మలకు సంబంధము లేదు.
అలాంటి యజ్ఞము నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మలతో పూర్వకాలములో వారి కోరికలు తీరినట్లు వుండేవి.

||శ్లోకము 11||

దేవాన్భావయతానేన తే దేవా భావయన్తు వః|
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ ||11||

స|| అనేన దేవాన్ భావయత | తే దేవాః వః భావయన్తు | ( తథా) పరస్పరం భావయన్తః పరం శ్రేయః అవాప్స్యథ ||

||శ్లోకార్థములు||

అనేన దేవాన్ భావయత - వీనిచేత దేవతలను సంతోషపరచుడు
తే దేవాః వః భావయన్తు - ఆ దేవతలు మిమ్ములను సంతోషపరుచురు గాక
పరస్పరం భావయన్తః - ఒకరినొకరు సంతోషపరచుచూ
పరం శ్రేయః అవాప్స్యథ - ఉత్తమమైన శ్రేయస్సు పొందగలరు

||శ్లోకతాత్పర్యము||

"వీనిచేత దేవతలను సంతోషపరచుడు. ఆ దేవతలు మిమ్ములను సంతోషపరుచురు గాక. ఒకరినొకరు సంతోషపరచుచూ ఉత్తమమైన శ్రేయస్సు పొందగలరు" ||11||

||శ్లోకము 12||

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః |
తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుజ్ఞ్తేస్తేన ఏవ సః||12||

స||యజ్ఞభావితాః దేవాః వఃఇష్టాన్ భోగాన్ దాస్యన్తే హి | తైః దత్తాన్ ( భోగాన్) ఏభ్యః అప్రదాయ యః భుజ్ఞ్తే సః స్తేన ఏవ చ ||

||శ్లోకార్థములు||

యజ్ఞభావితాః దేవాః - యజ్ఞములచే సంతోషింప చేయబడిన దేవతలు
వఃఇష్టాన్ భోగాన్ దాస్యన్తే హి - మీకు ఇష్ఠమైన భోగములను ఇచ్చెదరు.
తైః దత్తాన్ ( భోగాన్) ఏభ్యః అప్రదాయ - వారు ఇచ్చిన భోగములను వీరికి( దేవతలకు) ఇవ్వకుండా
యః భుజ్ఞ్తే సః స్తేన ఏవ చ - ఎవరు భుజించుచున్నాడో అట్టివాడు దొంగయే అగును.

||శ్లోకతాత్పర్యము||

"యజ్ఞములచే సంతోషింప చేయబడిన దేవతలు, మీకు ఇష్ఠమైన భోగములను ఇచ్చెదరు.
వారు ఇచ్చిన భోగములను వీరికి (దేవతలకు) ఇవ్వకుండా ఎవరు భుజించుచున్నాడో అట్టివాడు దొంగయే అగును. "||12||

||శ్లోకము 13||

యజ్ఞశిష్టాశినస్సన్తో ముచ్యన్తే సర్వ కిల్బిషైః |
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ||13||

స|| యజ్ఞశిష్ఠాశినః సన్తః సర్వకిల్బిషైః ముచ్యన్తే | యేతు ఆత్మకారణాత్ పచన్తి పాపాః తే అఘం( పాపమ్) భుఞ్జతే ||13||

||శ్లోకార్థములు||

యజ్ఞశిష్ఠాశినః సన్తః - యజ్ఞములో భగవదర్పణము చేసి మిగిలిన దానిని తిను సజ్జనులు
సర్వకిల్బిషైః ముచ్యన్తే - సమస్త పాపములనుండి విడవబడుచున్నారు.
యేతు ఆత్మకారణాత్ పచన్తి - ఎవరు తమకోసమే వండుకొనుచున్నారో
పాపాః తే అఘం( పాపమ్) భుఞ్జతే - పాపులైన వారు పాపమునే తినుచున్నారు.

||శ్లోకతాత్పర్యము||

"యజ్ఞములో భగవదర్పణము చేసి మిగిలిన దానిని తిను సజ్జనులుసమస్త పాపములనుండి విడవబడుచున్నారు.
ఎవరు తమకోసమే వండుకొనుచున్నారో, పాపులైన వారు పాపమునే తినుచున్నారు".||13||

||శ్లోకము 14-15||

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః |
యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||14||
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవమ్ |
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్||15||

స|| అన్నాత్ భూతాని భవన్తి | పర్జన్యాత్ అన్న సంభవః | యజ్ఞాత్ పర్జన్యః భవతి | యజ్ఞః కర్మ సముద్భవః | కర్మః బ్రహ్మోద్భవమ్| బ్రహ్మ ( వేద) అక్షర సముద్భవమ్ | తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం విద్ధి |

||శ్లోకార్థములు||
అన్నాత్ భూతాని భవన్తి - అన్నమునుంచి ప్రాణులు ఉద్భవించుచున్నవి
పర్జన్యాత్ అన్న సంభవః - మేఘములవలన అన్నము సంభవించుచున్నది
యజ్ఞాత్ పర్జన్యః భవతి - యజ్ఞమువలన మేఘములు సంభవించుచున్నవి
యజ్ఞః కర్మ సముద్భవః - యజ్ఞము కర్మాచరణము వలన కలుగుచున్నది
కర్మః బ్రహ్మోద్భవమ్ - కర్మ వేదములవలన కలుగుచున్నది
బ్రహ్మ ( వేద) అక్షర సముద్భవమ్ - వేదము అక్షర పరమాత్మ వలన కలుగు చున్నది
తస్మాత్ సర్వగతం బ్రహ్మ - అందువలన సర్వత్ర వ్యాపించియున్న బ్రహ్మము
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం విద్ధి - ఎల్లప్పుడు యజ్ఞములో ఉంచబడినదానిని గా తెలిసికొనుము.

||శ్లోకతాత్పర్యము||

"అన్నమునుంచి ప్రాణులు ఉద్భవించుచున్నవి.
మేఘములవలన అన్నము సంభవించుచున్నది.
యజ్ఞమువలన మేఘములు సంభవించుచున్నవి.
యజ్ఞము కర్మాచరణము వలన కలుగుచున్నది.
కర్మ వేదములవలన కలుగుచున్నది.
వేదము అక్షర పరమాత్మ వలన కలుగు చున్నది.
అందువలన సర్వత్ర వ్యాపించియున్న బ్రహ్మము,
ఎల్లప్పుడు యజ్ఞములో ఉంచబడినదానిని గా తెలిసికొనుము". ||14-15||

"అన్నమువలన ప్రాణులు ,
మేఘమువలన అన్నము,
యజ్ఞమువలన మేఘము ,
యజ్ఞము సత్కర్మ ఆచరణము వలన కలుగుచున్నది.

ఇంకా ముందుకు పోతే సత్కర్మము వేదములవలన,
వేదములు అక్షరబ్రహ్మ ద్వారా కలిగినవి.
అందువలన సర్వత్రా నిండియున్న బ్రహ్మమే
యజ్ఞము లో ప్రతిష్ఠించబడినది అని తెలుసుకొనుము" అని.

అంటే బ్రహ్మము వలన వేదము,
వేదము వలన సత్కర్మ,
సత్కర్మ వలన యజ్ఞము కలుగుచున్నవి .
ఇది ఒక ధర్మ చక్రము.

ఈ ధర్మ చక్రమును ప్రతి వాడు అనుసరించవలెనని కూడా కృష్ణుడు చెపుతాడు.
ఈ చక్రములోని యజ్ఞము, ఫలాసక్తిలేని యజ్ఞము.
అందువలననే కృష్ణుడు ఈ ధర్మచక్రమును ప్రతివారు అనుసరించాలి అంటాడు.

ఈ ధర్మచక్రమును అనుసరించనివాడు అంటే యజ్ఞములను ఫలాసక్తి తో చేసేవాడు అన్నమాట.
ఫలాసక్తి వున్నవాడు వాడి జీవితము వ్యర్థము (3.16)

||శ్లోకము 16||

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి||16||

స|| హే పార్థ ! యః ఏవం ప్రవర్తితమ్ చక్రం ఇహ న అనువర్తతి సః అఘాయు:( పాపజీవినః) , ఇన్ద్రియారామః ( ఇంద్రియాణాం ఆరామం కరోతి ఇతి ఇన్ద్రియారామః) మోఘం ( న అమోఘమ్) జీవతి ||

||శ్లోకార్థములు||

యః ఏవం ప్రవర్తితమ్ చక్రం - ఎవరు ఈ విధముగా ప్రవర్తింప చేయబడిన చక్రమును
ఇహ న అనువర్తతి - ఈ లోకములో అనుసరించడో
సః అఘాయు- వాడు పాపాత్ముడు
ఇన్ద్రియారామః మోఘం జీవతి - వాడు భోగాసక్తుడు వ్యర్థముగా బతుకు చున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు ఈ విధముగా ప్రవర్తింప చేయబడిన చక్రమును ఈ లోకములో అనుసరించడో,
వాడు పాపాత్ముడు. వాడు భోగాసక్తుడు, వ్యర్థముగా బతుకు చున్నాడు

||శ్లోకము 17||

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మ తృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్టః తస్య కార్యం న విద్యతే ||17||

స|| యః మానవః ఆత్మ రతిః ఏవ ఆత్మతృప్తః చ స్యాత్ తస్య కార్యం న విద్యతే ||17||

||శ్లోకార్థములు||

యః మానవః ఆత్మ రతిః ఏవ - ఏ మానవుడు ఆత్మలోనే రమించువాడు
ఆత్మతృప్తః చ స్యాత్ - ఆత్మలో నే తృప్తి చెందిన వాడో
తస్య కార్యం న విద్యతే - అట్టివాడికి చేయతగిన కార్యము లేదు

||శ్లోకతాత్పర్యము||

"ఏ మానవుడు ఆత్మలోనే రమించువాడు ఆత్మలో నే తృప్తి చెందిన వాడో
అట్టివాడికి చేయతగిన కార్యము లేదు".||17||

ఆత్మలోనే రమించువాడు ఆత్మలో నే తృప్తి చెందిన వాడు, అట్టివాడు ఆత్మజ్ఞానము తెలిసికొనినవాడు. అంటే మోక్షము పొందినవాడు. మోక్షము పొందినవాడికి వినతగినది లేదు. వినతగనిది లేదు. అతనికి చేయవలసిన కార్యము ( అంటే విధి) లేదు. చేయతగని కార్యము లేదు. ఇది కూడా బ్రహ్మజ్ఞానము కలిగినవాడికి, "వేదో అవేదో భవతి", అన్నమాటతో సమానము.

||శ్లోకము 18||

నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ||18||

స|| తస్య ఇహ కృతేన అర్థః అకృతేన కశ్చన దోషః న ( అస్తి) | అస్య సర్వభూతేషు అర్థవ్యపాశ్రయః కశ్చిత్ న ( అస్తి) ||18||

||శ్లోకార్థములు||

తస్య ఇహ కృతేన అర్థః న ఏవ - వానికి ఇక్కడ (కర్మ) చేయుటవలన ప్రయోజనము లేదు
అకృతేన కశ్చన దోషః న - చేయకపోయినచో దోషము లేదు
అస్య సర్వభూతేషు - అతడు సర్వప్రాణులలో
అర్థవ్యపాశ్రయః కశ్చిత్ న - స్వలాభము కొఱకు ఆశ్రయించవలసినది ఏదియు లేదు

అంటే ఆత్మజ్ఞానము పొందినవాడికి అంటే మోక్షము పొందినవాడికి, అంటే మోక్షము కావాలి అని పొందినవాడికి, ఇంక వేరే కావలసినది అన్నమాట లేదు. అలాంటి అప్పుడు ఇంకెవరినీ ఆశ్రయించవలసిన అవసరము కూడా రాదు. ఎందుకు రాదు అంటే, ఆయనకి కావలసినది దొరికిపోయింది కాబట్టి.

||శ్లోకతాత్పర్యము||

"వానికి ఇక్కడ (కర్మ) చేయుటవలన ప్రయోజనము లేదు. చేయకపోయినచో దోషము లేదు.
అతడు సమస్త ప్రాణులలో స్వలాభము కొఱకు ఆశ్రయించవలసినది ఏదియు లేదు." ||18||

కర్మ అందరూ చెయ్యాలా ?
కర్మయోగమనే విథి ఎవరికి లేదు?

ఆ ప్రశ్నకి సమాధానము,
అత్మజ్ఞానముపొందినవారికి కర్మ విథి అని లేదు.
జ్ఞానయోగ మార్గములో పోవువారికి కర్మ విథి అని లేదు.
అటువంటి వాళ్లకి, అంటే ఆత్మజ్ఞానము పొందిన వారికి
కర్మచేయడము వలనగాని చేయకపోవడము వలనకాని ఏమీ ప్రయోజనము లేదు.(3.18)

మిగిలిన వాళ్ళూ అందరికీ
అంటే ఆత్మ జ్ఞానమార్గములో పయనించని వారికి,
సాధారణ సంసార సాగరములో పయనించు వారికి
కర్మ తప్పని విథి యే.

అలాంటి వారు కర్మని ఫలాపేక్షలేకుండా చేయవలెనని,
కర్మ ద్వారా మోక్షము పొందవచ్చునని కృష్ణుని మాట(3.19)

||శ్లోకము 19||

తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ||19||

స|| తస్మాత్ ( త్వం) అసక్తః సతతం కార్యం కర్మ సమాచర | అసక్తః కర్మ ఆచరన్ పూరుషః పరమ్ ( మోక్షం) ఆప్నోతి హి ||19||

||శ్లోకార్థములు||

తస్మాత్ ( త్వం) అసక్తః - అందువలన నీవు అసక్తుడవై
సతతం కార్యం కర్మ సమాచర - ఎల్లప్పుడు కార్య కర్మమును ఆచరింపుము
అసక్తః కర్మ ఆచరన్ - సంగము లేకుండా కర్మ ఆచరిస్తూ
పరమ్ ( మోక్షం) ఆప్నోతి హి- పరమ గతిని (మోక్షము) పొందెదవు.

||శ్లోకతాత్పర్యము||

"అందువలన నీవు అసక్తుడవై, ఎల్లప్పుడు కార్య కర్మమును ఆచరింపుము.
సంగము లేకుండా కర్మ ఆచరిస్తూ మోక్షము పొందెదవు." ||19||

ఇక్కడ కృష్ణుడు అర్జునినికి కర్మయోగము ఆచరించమని చెప్పుతున్నాడు.

||శ్లోకము 20||

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి || 20||

స|| జనకాదయః కర్మణైవ సంసిద్ధిం( మోక్షం) ఆస్థితాహి | త్వం లోకసంగ్రహం సంపశ్యన్ అపి ( కర్మ) కర్తుమేవ అర్హసి ||20||

||శ్లోకార్థములు||

జనకాదయః కర్మణైవ - జనకాదులు కర్మాచరణముతోనే
సంసిద్ధిం( మోక్షం) ఆస్థితాహి - మోక్షమును పొందిరి.
త్వం లోకసంగ్రహం సంపశ్యన్ అపి -
నీవు లోకసంగ్రహము కోసము కూడా
( కర్మ) కర్తుమేవ అర్హసి - కర్మ చేయుటకు తగి వున్నావు.

||శ్లోకతాత్పర్యము||

"జనకాదులు కర్మా అచరణతోనే మోక్షమును పొందిరి.
నీవు లోకసంగ్రహము కోసము కూడా కర్మ చేయుటకు తగి వున్నావు".||20||

ఇలా కర్మవిధిని అనుసరించి మోక్షముపొందినవారెవరు అంటే
జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మ చేతనే మోక్షముపొందిరి అని కృష్ణుడు చెపుతాడు.

జనకుడు మున్నగువారు జ్ఞానులు అని మనము వినివుండవచ్చు .
అయితే నిష్కామ కర్మద్వారా మోక్షముపొందినా
కర్మలు వదలకుండా లోకసంగ్రహము కొఱకు నిష్కామ కర్మలు కొనసాగించారు అన్నమాట.(3.20)
ఇక్కడ జనకుడు మున్నగు వారు అంటే అంబరీషుడు, ప్రహ్లాదుడు, భగీరథుడు అన్నమాట.

ఇక్కడ అర్జునునికి నిష్కామకర్మలు ఆచరించడానికి కృష్ణుడు ఇంకో కారణము చెపుతాడు.
అదే లోకసంగ్రహము.లోకసంగ్రహముకొఱకు అయినా నిష్కామ కర్మ చెయ్యి అని.

లోకసంగ్రహము తో నాకేమి పని అని అనుకునేటట్టయితే కృష్ణుడు తననే ఉదాహరణగా చెపుతాడు.

||శ్లోకము 21||

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః|
స యత్ప్రమాణమ్ కురుతే లోకస్తదనువర్తతే ||21||

స||శ్రేష్ఠః యత్ యత్ ఆచరతి ఇతరః జనః తత్ తత్ ఏవ ( ఆచరతి) | సః యత్ ప్రమాణం కురుతే లోకః తత అనువర్తతే ||21||

||శ్లోకార్థములు||

శ్రేష్ఠః యత్ యత్ ఆచరతి- శ్రేష్ఠులు ఏ ఏ విధముగా ఆచరించుచున్నారో
ఇతరః జనః తత్ తత్ ఏవ ( ఆచరతి) - ఇతర జనులు అదేవిధముగా ఆచరించుచున్నారు
సః యత్ ప్రమాణం కురుతే - అతడు దేనిని ప్రమాణముగా కైకొనుచున్నాడో
లోకః తత అనువర్తతే - లోకులు కూడా అదే అనుసరించెదరు

||శ్లోకతాత్పర్యము||

"శ్రేష్ఠులు ఏ ఏ విధముగా ఆచరించుచున్నారో, ఇతర జనులు అదేవిధముగా ఆచరించుచున్నారు.
అతడు దేనిని ప్రమాణముగా కైకొనుచున్నాడో లోకులు కూడా అదే అనుసరించెదరు". ||21||

పెద్దలు ఏవిధముగా కర్మలు ఆచరించుచున్నారో, తక్కిన జనులు కూడా అదే విధముగా కర్మను అనుసరించెదరు. పెద్దలు ఏది ప్రమాణముగా భావిస్తారో అదే మిగిలినవారికి కూడా ప్రమాణము. ఇది సామాన్య విషయము. ఇది యథా రాజా తథా ప్రజా అంటూ విన్నమాటే అందుకని పెద్దలు అప్రమత్తులుగా వుండవలెను. అదే కృష్ణుడు తనకి కూడా వర్తిస్తుంది అని చెపుతున్నాడు.

||శ్లోకము 22||

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||22||

స|| హే పార్థ! మే త్రిషు లోకేషు కర్తవ్యం కించన న అస్తి| అనవాప్తం అవాప్తవ్యం న అస్తి | తథాపి చ (అహం) కర్మణి వర్త ఏవ చ ||22||

||శ్లోకార్థములు||

హే పార్థ! మే త్రిషు లోకేషు - ఓ పార్థా, నాకు ముల్లోకములలో
కర్తవ్యం కించన న అస్తి- చేయవలసిన పని ఏమాత్రము లేదు
అనవాప్తం అవాప్తవ్యం న అస్తి - నేను పొందతగినది, పొందలేనిది లేదు.
(తథాపి) వర్త ఏవ చ కర్మణి - అయిననూ కర్మలయందే ప్రవర్తించుచున్నాను.

||శ్లోకతాత్పర్యము||

ఓ పార్థా, నాకు ముల్లోకములలో చేయవలసిన పని ఏమాత్రము లేదు.
నేను పొందతగినది, పొందలేనిది లేదు.
అయిననూ కర్మలయందే ప్రవర్తించుచున్నాను."||22||

కృష్ణుడు తనగురించి ఈ అధ్యాయములో మొదటిలో చెప్పాడు. కర్మయోగము పూర్వకాలములో తనే చెప్పినట్లు. దాని బట్టి గ్రహించవలసినది కృష్ణభగవానుని స్వరూపము. అది తెలిసినవానికి ఇక్కడ శ్లోకములో విన్నది అర్థము అవుతుంది. కృష్ణభగవానుని కి ( "పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్"- సాధువులను రక్షించడము, దుర్మార్గులను శిక్షింపడము తప్ప) చేయవలసినది ఏది లేదు. ఆయనకి పొందతగినది పొందలేనిది కూడా లేదు. కాని ఆయన కర్మాచరణములో నిమగ్నుడై వున్నాడు. అదే అందరికి మార్గదర్శకము.

||శ్లోకము 23||

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ||23||

స||హే పార్థ ! యది అహం జాతు అతన్ద్రితః ( సన్) కర్మణి న వర్తేయం ( తతః) మనుష్యాః సర్వశః మమ వర్త్మ( మార్గం) అనువర్తనే || 23||

||శ్లోకార్థములు||

యది అహం జాతు - ఒక వేళ నేను ఎప్పుడు
అతన్ద్రితః ( సన్) కర్మణి న వర్తేయం - జాగరూకతతో కర్మయందు ప్రవర్తించనిచో
మనుష్యాః సర్వశః - మనుష్యులందరూ అన్నివిధములుగా
మమ వర్త్మ( మార్గం) అనువర్తనే - నా యొక్క మార్గమునే అనుసరించి వర్తించుదురు

||శ్లోకతాత్పర్యము||

"ఓ పార్థా, నేను ఎప్పుడు జాగరూకతతో కర్మయందు ప్రవర్తించనిచో ,
మనుష్యులందరూ అన్నివిధములుగా
నా యొక్క మార్గమునే అనుసరించి వర్తించుదురు."||23||

అంటే యథా రాజా తథా ప్రజా అన్నమాట గుర్తుంచుకోండి అని కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు.
అధికారములో నున్న వ్యక్తి తను ఏమి చెయ్యకుండా మిగిలిన వారిపై అధికారము చెలాయిస్తే అది జరిగే పని కాదు అని.

||శ్లోకము 24||

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మచేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ||24||

స||అహం కర్మ న కుర్యాం చేత్ ఇమే లోకాః ఉత్సీదేయుః ( భ్రష్ఠః భవన్తి)| ( అహమ్) సంకరస్య చ కర్తా స్యామ్ |ఇమాః ప్రజాఃఉపహన్యామ్ ||24||

||శ్లోకార్థములు||

అహం కర్మ న కుర్యాం చేత్- నేను కర్మను చేయకుందునేని
ఇమే లోకాః ఉత్సీదేయుః - ఈ లోకులు భ్రష్టులగుదురు
సంకరస్య చ కర్తా స్యామ్ - అట్టి సంకరమునకు కర్తను అగుదును
ఇమాః ప్రజాఃఉపహన్యామ్- ఈ ప్రజలను చెడగొట్టినవాడను అగుదును

||శ్లోకతాత్పర్యము||

"నేను కర్మను చేయకుందునేని ఈ లోకులు భ్రష్టులగుదురు.
నేను అట్టి సంకరమునకు కర్తను అగుదును. ఈ ప్రజలను చెడగొట్టినవాడను అగుదును". ||24||

||శ్లోకము 25||

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత |
కుర్యాద్విద్వాం స్తథాఽసక్తః చికీర్షుః లోక సంగ్రహమ్ || 25||

స|| హే భారత్ ! అవిద్యాః కర్మణి (ఆ)సక్తాః యథా కర్మ కుర్వన్తి తథా విద్వాన్ అసక్తః లోక సంగ్రహంచికీర్షుః ( కర్మాణి) కుర్యాత్ ||25||

||శ్లోకార్థములు||

అవిద్యాః కర్మణి (ఆ)సక్తాః - అజ్ఞానులు కర్మయందు ఎంత ఆసక్తితో
యథా కర్మ కుర్వన్తి - ఎలా బంధసహితమైన కర్మను ఆచరిస్తారో
తథా విద్వాన్ అసక్తః - అదే విధముగా విద్వాంసుడు కోరిక లేకుండా
లోక సంగ్రహం చికీర్షుః ( కర్మాణి) కుర్యాత్ -
లోకకల్యాణము నెరవేర్చతలంపు కలవాడై కర్మలను చేయవలెను.

||శ్లోకతాత్పర్యము||

"అజ్ఞానులు కర్మయందు ఎంత ఆసక్తితో ఎలా బంధసహితమైన కర్మను ఆచరిస్తారో,
అదే విధముగా విద్వాంసుడు కోరిక లేకుండా,-
లోకకల్యాణము నెరవేర్చతలంపు కలవాడై కర్మలను చేయవలెను". ||25||

||శ్లోకము 26||

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్ |
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ || 26||

స|| విద్వాన్ కర్మ సంగినాం అజ్ఞానామ్ బుద్ధిభేదమ్ న జనయేత్ సర్వకర్మాణి (స్వయం) యుక్తః సమాచరన్ జోషయేత్ ||26||

||శ్లోకార్థములు||

విద్వాన్ కర్మ సంగినాం అజ్ఞానామ్- జ్ఞాని కర్మలయందు ఆసక్తి కల అజ్ఞానులకు
బుద్ధిభేదమ్ న జనయేత్ - ఫలకర్మలయందు ఆసక్తి గల బుద్ధికి చలనము పుట్టించకూడదు
సర్వకర్మాణి (స్వయం) యుక్తః - సమస్త కర్మలను యోగయుక్తుడై తనే
సమాచరన్ జోషయేత్ - ఆచరించుచూ చేయించవలెను

||శ్లోకతాత్పర్యము||

"జ్ఞాని, కర్మలయందు ఆసక్తి కల అజ్ఞానులకు, ఫలకర్మలయందు ఆసక్తి గల బుద్ధికి చలనము పుట్టించకూడదు.
సమస్త కర్మలను యోగయుక్తుడై తనే ఆచరించుచూ చేయించవలెను".||26||

అయితే ఆసక్తితో కర్మకాండలో మునిగి ఉన్నవారిని కదిపి, వద్దు మీరు నిష్కామ కర్మ చేయ్యాలి అని చెప్పడము కన్న,
వారికి జ్ఞాని అగువాడు తనంతట తాను చేయవలసిన పనులను చేసి చూపించవలెను.
వారు తన ఆచరణను చూచి తమంతట తామే మనస్సు మార్చుకొని నిష్కామకర్మలోకి వచ్చుట మంచిది.(3.26)

||శ్లోకము 27||

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకార విమూఢాత్మా కర్తాహం ఇతి మన్యతే|| 27||

స|| ప్రకృతేః గుణైః సర్వశః క్రియమాణాని కర్మాణి అహంకారవిమూఢాత్మా అహం కర్తా ఇతిమన్యతే ||27||

||శ్లోకార్థములు||

ప్రకృతేః గుణైః సర్వశః - ప్రకృతియొక్క గుణములచేత అన్నివిధముల
సర్వశః క్రియమాణాని కర్మాణి - అనేకవిధములుగా చేయబడుతున్న కర్మలను
అహంకారవిమూఢాత్మా- అహంకారము గల అజ్ఞానుడు
అహం కర్తా ఇతిమన్యతే - తనే కర్తను అని భావించును

||శ్లోకతాత్పర్యము||

"ప్రకృతియొక్క గుణములచేత అన్నివిధముల
అనేకవిధములుగా చేయబడుతున్న కర్మలను,
అహంకారము గల అజ్ఞానుడు తనే కర్తను అని భావించును".||27||

ఆత్మ జ్ఞానములేని వారు, లేక జ్ఞానము లేనివారు
కర్మ ప్రభావములో ఎలా వస్తారు అన్నమాటకి సమాధానముగా కృష్ణుడు
కర్మలన్నీ ప్రకృతి గుణములచే చేయబడుతున్నాయి.
మూఢుడు ఆకర్మలు తనే చేస్తున్నాను అనుకుంటాడు.(3.27)

||శ్లోకము 28||

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణాగుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ||28||

స|| హే మహాబాహో ! గుణకర్మవిభాగయోః తత్వవిత్తు , గుణాః గుణేషు వర్తన్తే ఇతి మత్వా న సజ్జతే ||28||

||శ్లోకార్థములు||

హే మహాబాహో - ఓ మహాబాహువులు కలవాడా
గుణకర్మవిభాగయోః తత్వవిత్తు - గుణములయొక్క కర్మలయొక్క విభజన యదార్థము తెలిసినవాడు
గుణాః గుణేషు వర్తన్తే - గుణములు గుణములయందు ప్రవర్తించుచున్నవి
ఇతి మత్వా న సజ్జతే - అని తెలిసికొని సంగము కలిగియుండడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ మహాబాహువులు కలవాడా, గుణములయొక్క కర్మలయొక్క విభజన యదార్థము తెలిసినవాడు,
గుణములు గుణములయందు ప్రవర్తించుచున్నవి, అని తెలిసికొని సంగము కలిగియుండడు".||28||

నిజము తెలిసిన జ్ఞాని ఆ గుణములకు దూరముగా ఉంటాడు (3.28).

||శ్లోకము 29||

ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మన్దాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ||29||

స|| (యే) ప్రకృతేః గుణసమ్మూఢాః గుణకర్మసు సజ్జన్తే అకృత్స్నవిదః ( అల్పజ్ఞః) మందాన్ తాన్ కృత్స్నవిత్ ( జ్ఞాని) న విచాలయేత్ ||29||

||శ్లోకార్థములు||

ప్రకృతేః గుణసమ్మూఢాః - ప్రకృతియొక్క గుణములచే మోహపెట్టబడినవారై
గుణకర్మసు సజ్జన్తే - గుణకర్మలయందు ఆసక్తికలవారు అగుచున్నారో
అకృత్స్నవిదః ( అల్పజ్ఞః) మందాన్ - అల్పజ్ఞులు మందమతులు అగు
తాన్ కృత్స్నవిత్ ( జ్ఞాని) న విచాలయేత్ - అట్టివారిని జ్ఞాని చలింప చేయరాదు

||శ్లోకతాత్పర్యము||

"ప్రకృతియొక్క గుణములచే మోహపెట్టబడినవారై
గుణకర్మలయందు ఆసక్తికలవారు అగుచున్నారో,
అల్పజ్ఞులు మందమతులు అగునట్టివారిని, జ్ఞాని చలింప చేయరాదు".||29||

"న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం" అంటూ ముందు శ్లోకములో( 3.26) చెప్పినమాటే ఇక్కడ మళ్ళీ కృష్ణుడు చెపుతున్నాడు. ఇక్కడ కృష్ణుడు అర్జునిడికి బోధిస్తున్నాడు. ఇక్కడ గురుశిష్య భావము వున్నది. అలాంటి గురుశిష్యభావము లేని చోట, మిత్రభావము తో మిత్రునిమాట వినతగినది అన్న భావము లేని చోట, అజ్ఞానిని చూచినా జ్ఞాన బోధ చేయ రాదు అని.

||శ్లోకము 30||

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా |
నిరాశీనిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః ||30||

స|| సర్వాణి కర్మాణి మయి అధ్యాత్మ చేతసా సన్న్యస్య నిరాశీః నిర్మమః భూత్వా విగత జ్వరః యుధ్యస్వ ||

||శ్లోకార్థములు||

సర్వాణి కర్మాణి మయి - సమస్త కర్మలను నాయందు
అధ్యాత్మ చేతసా సన్న్యస్య - ఆధ్యాత్మిక బుద్ధితో సన్న్యసించి
నిరాశీః నిర్మమః భూత్వా - ఆశ మమకారము లేకుండా
విగత జ్వరః యుధ్యస్వ - సంతాప రహితుడవై యుద్ధము చేయుము.

||శ్లోకతాత్పర్యము||

"సమస్త కర్మలను నాయందు ఆధ్యాత్మిక బుద్ధితో సన్న్యసించి,
ఆశ మమకారము లేకుండా సంతాప రహితుడవై యుద్ధము చేయుము". ||30||

అలాగ ఆత్మ జ్ఞానము లేని వారు కర్మ ఎలాచెయ్యాలి అన్నది ఒక ప్రశ్న లేక సమస్య.
దానికి సమాధానము ఆ కర్మలన్నీ భగవంతునికే సమర్పించి చెయ్యాలి అని కృష్ణుని సందేశము (3.30)

ఈ విధముగా కర్మాచరణము గురించి చెప్పికృష్ణుడు మళ్ళీ ఇట్లా అంటాడు.

శ్రీభగవానువాచ
"నిరాశీః నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ విగతజ్వరః ||(3.30)||

అంటే కోరికలు లేకుండా మమకారము లేకుండా సంతాపము లేకుండా, కర్మలను నాకు ( భవంతునికి) సమర్పించి, యుద్దము చేయుము అని అర్జునుడి కి చెపుతాడు.

నిష్కామకర్మకి అగ్రస్థానము ఇవ్వడము కోసము శ్రీకృష్ణుడు అంతాచెప్పి
నిష్కామ కర్మ యే తన మతముగా చెపుతాడు

||శ్లోకము 31||

యే మే మతమిదం నిత్యం అనుతిష్ఠన్తి మానవాః |
శ్రద్ధావన్తోఅనసూయాన్తో ముచ్యన్తే తేsపి కర్మభిః ||31||

స|| యే మానవాః మే ఇదం మతం శ్రద్ధావన్తః అనసూయన్తః ( న అసూయన్తః) నిత్యం అనుతిష్ఠన్తి తే అపి కర్మభిః ముచ్యన్తే ||31||

||శ్లోకార్థములు||

యే మానవాః మే ఇదం మతం - ఏ మానవులు నా ఈ మతమును
శ్రద్ధావన్తః అనసూయన్తః - శ్రద్ధతోనూ అసూయలేనివారై
నిత్యం అనుతిష్ఠన్తి - నిత్యము అనుసరించెదరో
తే అపి కర్మభిః ముచ్యన్తే - వారు కర్మబంధనములనుండి ముక్తి పొందుదురు

||శ్లోకతాత్పర్యము||

"ఏ మానవులు నా ఈ మతమును శ్రద్ధతోనూ అసూయలేనివారై
నిత్యము అనుసరించెదరో వారు కర్మబంధనములనుండి ముక్తి పొందుదురు".||31||

అంటే "ఏ మనుష్యులు నా మతము ( నా అభిమతమును, అంటే నిష్కామ కర్మను) శ్రద్ధగా అసూయలేనివారుగా నిత్యము అంటే ఎల్లప్పుడూ అనుసరించెదరో వారు కర్మబంధమునుంచి కూడా విడువబడుచున్నారు"అని.

అర్జునిడి ప్రశ్నలో , 'జ్ఞాన కర్మయోగములలో జ్ఞానయోగము శ్రేష్ఠము అనుకుంటే..' జ్ఞానయోగము కర్మయోగము కన్నా విశిష్ఠమైనదా? అన్న ప్రశ్న ఇమిది ఉన్నది. అది కృష్ణుడు నిరాకరించలేదు. కాని అర్జునిడిని కర్మయోగము నాశ్రయించి యుద్ధము చేయుము అని ఈ అధ్యాయములో ( యుధ్యస్వ విగతజ్వరః|2.30) కూడా చెప్పడమైనది. అర్జునుడు కర్మయోగము అనుసరించవలెను అన్నమాటని నొక్కిపరస్తూ - ఇది నామతము - అని ఇక్కడ కృష్ణుడు చెప్పుచున్నాడు.

||శ్లోకము 32||

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్ |
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ||32||

స|| యేతు మే ఏతత్ మతమ్ అభ్యసూయన్తః న అనుతిష్ఠన్తి తాన్ అచేతసః సర్వ జ్ఞాన విమూఢాన్ నష్ఠాన్ విద్ధి ||32||

||శ్లోకార్థములు||

యేతు మే ఏతత్ మతమ్ - ఎవరు నా ఈ మతమును
అభ్యసూయన్తః న అనుతిష్ఠన్తి - ద్వేషించువారై అనుసరింపరో
తాన్ అచేతసః సర్వ జ్ఞాన విమూఢాన్ - వారిని మూఢులుగను, ఏ విధమగు జ్ఞానము లేని వారిగను
నష్ఠాన్ విద్ధి - చెడినవారలు గను తెలిసికొనుము

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు నా ఈ మతమును ద్వేషించువారై అనుసరింపరో,
వారిని మూఢులుగను, ఏ విధమగు జ్ఞానము లేని వారిగను,చెడినవారలు గను తెలిసికొనుము".||32||

||శ్లోకము 33||

అదృశం చేష్ఠతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి |
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||33||

స|| జ్ఞానవానపి స్వస్యాః ప్రకృతేః సదృశమ్ చేష్ఠతే భూతాని ప్రకృతిమ్ యాన్తి నిగ్రహః కిం కరిష్యతి ||33||

||శ్లోకార్థములు||

జ్ఞానవానపి స్వస్యాః ప్రకృతేః - జ్ఞానవంతుడైనను తన యొక్క ప్రకృతికి
సదృశమ్ చేష్ఠతే - అనుగుణముగనే ప్రవర్తించుచున్నాడు.
భూతాని ప్రకృతిమ్ యాన్తి - ప్రాణులు తమ స్వభావము అనుసరించి నడుచుచున్నారు
నిగ్రహః కిం కరిష్యతి - నిరోధము ఏమి చేయగలదు.

||శ్లోకతాత్పర్యము||

"జ్ఞానవంతుడైనను తన యొక్క ప్రకృతికి అనుగుణముగనే ప్రవర్తించుచున్నాడు.
ప్రాణులు తమ స్వభావము అనుసరించి నడుచుచున్నారు. నిరోధము ఏమి చేయగలదు?" ||33||

పండితులను కూడా స్వభావము అణచలేకపోతే సామాన్యులసంగతి చెప్పనేల అన్నట్లు ఇక్కడ వింటున్నాము. అంటే ఈ ప్రకృతిగుణములు చాలా బలము కలవి అని అర్థము. అందుకని వాటిని అదుపులో పెట్టడానికి గట్టిగా ప్రయత్నము చెయ్యాలి అని ఇక్కడ భావము.

||శ్లోకము 34||

ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్చేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ||34||

స|| ఇన్ద్రియస్య ఇన్ద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశమ్ న అగచ్చేత్ | తౌ అస్య పరిపన్థినౌ ||34||

||శ్లోకార్థములు||

ఇన్ద్రియస్య ఇన్ద్రియస్య అర్థే - ప్రతి ఇన్ద్రియము యొక్క
రాగద్వేషౌ వ్యవస్థితౌ - రాగ ద్వేషములు ఏర్పడి యున్నవి.
తయోః వశమ్ న అగచ్చేత్ - వాటి వశములో రాకూడదు
తౌ అస్య పరిపన్థినౌ - ఆ రాగద్వేషములు వీనికి శత్రువులు కదా

||శ్లోకతాత్పర్యము||

"ప్రతి ఇన్ద్రియము యొక్క రాగ ద్వేషములు ఏర్పడి యున్నవి.
వాటి వశములో రాకూడదు. ఆ రాగద్వేషములు వీనికి శత్రువులు కదా". ||34||

ఇన్ద్రియముల స్వభావము రాగ ద్వేషములు. మనకి కొన్నిటిమీద ప్రేమ, కొన్నిటి మీద ద్వేషము. అది స్వభావికము. కాని అవి మంచి గుణములు కావు. అందుకనే కృష్ణుడు, 'తయోః వశమ్ న అగచ్చేత", అంటే వాటి వశములో పడకు అని చెపుతున్నాడు. అవి మనశత్రువులు.

||శ్లోకము 35||

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||35||

స|| స్వ అనుష్ఠితాత్ ( కర్మః) పరధర్మాత్ విగుణః స్వధర్మః శ్రేయాన్ ( అస్తి) | స్వధర్మే నిధనమ్ ( మరణమ్) శ్రేయః | పరధర్మః భయావహః ||35||

||శ్లోకార్థములు||

స్వ అనుష్ఠితాత్ పరధర్మాత్ - చక్కగా ఆచరింపబడిన పరధర్మము కన్న
విగుణః స్వధర్మః శ్రేయాన్ - గుణములు లేనిదైనను తన ధర్మము శ్రేయము
స్వధర్మే నిధనమ్ ( మరణమ్) శ్రేయః - తన ధర్మములో మరణమైనను శ్రేయస్కరము
పరధర్మః భయావహః - పరుల ధర్మము
భయము కలుగ చేయునది

||శ్లోకతాత్పర్యము||

"చక్కగా ఆచరింపబడిన పరధర్మము కన్నగుణములు లేనిదైనను తన ధర్మము శ్రేయము.
తన ధర్మములో మరణమైనను శ్రేయస్కరము. పరుల ధర్మము భయము కలుగ చేయునది".||35||

ఇక్కడ 'స్వధర్మము' అంటే ఆత్మసంబంధమైన ధర్మము అని, 'పరధర్మము' అంటే ఇహలోక దృశ్య సంబంధమైన ధర్మము అనుకుంటే , ఈ శ్లోకము చక్కని అర్థము ఇస్తుంది. ఆత్మసంబంధమైన విషయాలు ఆచరణలో కష్టము అనిపిస్తాయి. లోక సంబంధమైన విషయాలు ఆచరణలో అతి సులభము. అయినాగాని ఆత్మసంబంధమైన ధర్మము అనుసరించుట శ్రేయము అని.

ఇది అర్జునుడిని ఉద్దేశించి చెప్పినమాట గా చూస్తే , ఓ అర్జునా నీ ధర్మమైన క్షత్రియ ధర్మము అనుసరించి యుద్ధము చేయుము అని. అలా చేసినట్లయితే శాశ్వత కీర్తి సంపాదించగలగడము అవుతుంది. నీ క్షత్రియ ధర్మములో మరణించినా శ్రేయస్కరము అని.
ఈ మాట సామాన్య జనులకు వర్తించినప్పుడు ఒకడు కష్టముగా వున్న తను చేయవలసిన కార్యములను చేయక, ఇంకొకడి కార్యము చేయడము తగదు అని.

||శ్లోకము 36||

అర్జున ఉవాచ:

అథ కేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుషః|
అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ||36||

స|| హే వార్ష్ణేయ ! అథ అయమ్ పూరుషః కేన ప్రయుక్తః అనిచ్ఛన్ అపి బలాత్ నియోజిత ఏవ పాపమ్ చరతి ?||36||

||శ్లోకార్థములు||

అథ అయమ్ పూరుషః - అయితే ఈ పురుషుడు
కేన ప్రయుక్తః - దేని చేత ప్రోత్సహించబడినవాడై
అనిచ్ఛన్ అపి బలాత్ నియోజిత ఏవ - కోరనప్పటికీ బలాత్కారముగా నియోగింపబడిన వాని వలె
పాపమ్ చరతి - పాపము చేయుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||

అర్జునుడు చెప్పుచున్నాడు:
"అయితే ఈ పురుషుడు దేని చేత ప్రోత్సహించబడినవాడై,
కోరనప్పటికీ బలాత్కారముగా నియోగింపబడిన వాని వలె, పాపము చేయుచున్నాడు." ||36||

కర్మసిద్ధాంతము వినుటకు సులభము. చేయుట కూడా సులభమే.
అయినా అందరూ దీనిని అమలు చేయకపోతున్నారు ఎందుకు?
అంతే కాదు చేయకూడని ఎందుకు పనులు చేస్తాడు?. అలాగ అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి.

అదే అర్జునుడు అడుగుతాడు

"అథకేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుషః"(3.36)
"అయితే మానవుడు దేనిచేత ప్రేరేపింప బడిన వాని వలె పాపము చేయుచున్నాడు ?"
అందులోనూ
"అనిచ్చన్నపి" పాపము చెయ్యాలని కోరిక లేక పోయినా గాని
పాపము చేయుటకు ప్రేరేపింపబడుతున్నాడు.
అంతే కాదు
"బలాదివ నియోజితః" - అంటే ఎవరో బలవంతముగా చేయించినట్లు చేస్తారుట !

అలా పాపకర్మలు ఎందుకు చేస్తారు అన్నమాటకి కృష్ణుడు విశదీకరిస్తాడు

||శ్లోకము 37||

శ్రీ భగవానువాచ:

కామ ఏష క్రోధఏష రజోగుణ సముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ||37||

స|| ఏషః రజోగుణ సముద్భవః కామః | ఏషః (కామః) క్రోధః (భవతి) | (ఏషః) మహాశనః మహాపాప్మా (చ) | ఏనం (కామం) ఇహ వైరిణః విద్ధి||37||

||శ్లోకార్థములు||

ఏషః- దీనికి కారణము
రజోగుణ సముద్భవః కామః - రజోగుణమునుండి ఉద్భవించిన కామము
ఏషః (కామః) క్రోధః (భవతి) - ఇదియే క్రోధము
(ఏషః) మహాశనః మహాపాప్మా (చ) -(ఇదియే) తృప్తిపొందనిది, మహపాపములకు కారణ భూతము
ఏనం (కామం) ఇహ వైరిణః విద్ధి - దీనిని ఇక్కడ శత్రువుగా తెలిసికొనుము

||శ్లోకతాత్పర్యము||

భగవంతుడు చెప్పుచున్నాడు:
"దీనికి కారణము రజోగుణమునుండి ఉద్భవించిన కామము. ఇదియే క్రోధము.
ఇది తృప్తిపొందనిది, మహపాపములకు కారణ భూతము. దీనిని ఇక్కడ శత్రువుగా తెలిసికొనుము." ||

మన పాపములకు కారణము మనలో వున్నకోరికలు.అదే క్రోధము కూడా. ఇది మనకి అన్ని విధములుగా జీవన యాత్రలో కూడా పరమ శత్రువు. మన ఆధ్యాత్మిక మార్గములో అంటే మోక్షసాధనకు వెళ్ళే మార్గములో మహత్తరమైన శత్రువు. ఈ శత్రువు ను హతమొనర్చుము అంటాడు కృష్ణుడు.

||శ్లోకము 38||

ధూమేనావ్రియతే వహ్నిః యథాఽఽదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||38||

స|| యథా ధూమేన అగ్ని అవ్రియతే , (యథా) ఆదర్శః చ మలేన ( అవ్రియతే) యథా ఉల్బేన గర్భః ఆవృతః , తథా తేన ( తత్ కామేన) ఇదం ( ఆత్మజ్ఞానమ్) ఆవృతమ్ || 38||

||శ్లోకార్థములు||

యథా ధూమేన అగ్ని అవ్రియతే - ఏ విధముగా పొగ చేత అగ్ని కప్పబడుచున్నదో
(యథా) ఆదర్శః చ మలేన ( అవ్రియతే) - (ఏవిధముగా) అద్దము మలినముచే (కప్పబడుచున్నదో)
యథా ఉల్బేన గర్భః ఆవృతః -(ఏవిధముగా) మావిచేత గర్భము (కప్పబడుచున్నదో)
తథా తేన ( తత్ కామేన) ఆవిధముగా ఆ కామముచేత
ఇదం ( ఆత్మజ్ఞానమ్) ఆవృతమ్ - ఈ జ్ఞానము కప్పబడుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఏ విధముగా పొగ చేత అగ్ని కప్పబడుచున్నదో, ఏ విధముగా అద్దము మలినముచే కప్పబడుచున్నదో,
ఏ విధముగా మావిచేత గర్భము కప్పబడుచున్నదో,
ఆ విధముగా ఆ కామముచేత ఈ జ్ఞానము కప్పబడుచున్నది."||38||

చేయతగని పని చేయకూడదు అన్నది జ్ఞానము. ఆ జ్ఞానము మనలో వున్నపటిష్ఠమైన కోరిక , ఆ జ్ఞానముని కప్పివేస్తుంది. ఆ సమయములో మనకు కనపడదు. అందుకనే మనము పాపానికి పూనుకుంటాము. అని దీని భావము.

||శ్లోకము 39||

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ||39||

స||హే కౌన్తేయ ! దుష్పూరేణ అనలేన చ కామరూపేణ జ్ఞానినః నిత్య వైరిణా ఏతేన జ్ఞానమ్ ఆవృతమ్ ||39||

||శ్లోకార్థములు||

హే కౌన్తేయ ! దుష్పూరేణ - ఓ కౌన్తేయా, నిండింపశక్యముకాని
అనలేన చ కామరూపేణ - అగ్నివలె తృప్తిపొందనదియు, కామ రూపమైనదియు
జ్ఞానినః నిత్య వైరిణా - జ్ఞానులకు ఎల్లప్పుడు శత్రువు అగు
ఏతేన జ్ఞానమ్ ఆవృతమ్ - ఈ కోరికలచేత జ్ఞానము కప్పివేయబడియున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఓ కౌన్తేయా, నిండింపశక్యముకాని, అగ్నివలె తృప్తిపొందనదియు, కామ రూపమైనదియు
జ్ఞానులకు ఎల్లప్పుడు శత్రువు అగు ఈ కోరికల చేత, జ్ఞానము కప్పివేయబడియున్నది." ||39||

కోరికలు అన్నవి ఎప్పుడు తీర్చబడలేనివి. అగ్నిలాగా తృప్తిపొందనివి. ఇవే అన్నివిధాలా మనుష్యునకు శత్రువు. ఇది మనకి తెలిసినాకాని దీనిని వదలేకపోతున్నాము.

||శ్లోకము 40||

ఇన్ద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే |
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ||40||

స|| ఇన్ద్రియాణి మనః బుద్ధిః అస్య అధిష్ఠానం (ఇతి) ఉచ్యతే | ఏషః( కామః) ఏతైః ( ఇన్ద్రియైః) జ్ఞానమ్ ఆవృత్య దేహినామ్ విమోహయతి ||40||

||శ్లోకార్థములు||

ఇన్ద్రియాణి మనః బుద్ధిః - ఇన్ద్రియములు మనస్సు బుద్ధి
అస్య అధిష్ఠానం (ఇతి) ఉచ్యతే - దీని ఆశ్రయములు అని చెప్పబడుచున్నవి
ఏషః( కామః) ఏతైః ( ఇన్ద్రియైః) జ్ఞానమ్ ఆవృత్య - ఈ కామము ఈ ఇన్ద్రియముల ద్వారా జ్ఞానమును కప్పి
దేహినామ్ విమోహయతి - మనుజును మోహపెట్టుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఇన్ద్రియములు, మనస్సు, బుద్ధి దీని ఆశ్రయములు అని చెప్పబడుచున్నవి.
ఈ కామము ఈ ఇన్ద్రియముల ద్వారా జ్ఞానమును కప్పి మనుజును మోహపెట్టుచున్నది." ||40||

మనకోరికలకు ఆశ్రయము మనస్సు బుద్ధి. మనస్సులో దూరిన కోరిక, జ్ఞానమును కప్పి వేస్తుంది.

||శ్లోకము 41||

తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ||41||

స|| హే భరతర్షభ ! తస్మాత్ త్వం ఆదౌ ఇన్ద్రియాణి నియమ్య జ్ఞాన విజ్ఞాన నాశనమ్ పాప్మానమ్ ఏనమ్( కామం) హి ప్రజహి ||41||

||శ్లోకార్థములు||

హే భరతర్షభ ! తస్మాత్ - ఓ అర్జునా, అందువలన
త్వం ఆదౌ ఇన్ద్రియాణి నియమ్య - నీవు మొదట ఇన్ద్రియములను నిగ్రహించి
జ్ఞాన విజ్ఞాన నాశనమ్ - జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునట్టి,
పాప్మానమ్ ఏనమ్( కామం) హి ప్రజహి- పాపరూపమైనఈ కామమును తప్పకుండా విడువుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ అర్జునా, అందువలన, నీవు మొదట ఇన్ద్రియములను నిగ్రహించి,
జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునట్టి, పాపరూపమైన ఈ కామమును తప్పకుండా విడువుము." ||41||

అంటే పాపము వేపు పరుగెట్టకుండా వుండాలి అంటే, కోరికలు అన్న శత్రువును అదుపులో వుంచాలి.

||శ్లోకము 42||

ఇన్ద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ||42||

స|| ఇన్ద్రియాణి పరాణి | ఇన్ద్రియేభ్యః మనః పరమ్ | మనసః తు బుద్ధిః పరా| బుద్ధే పరతః యః తు సః ( అత్మా) ఆహుః ||42||

||శ్లోకార్థములు||

ఇన్ద్రియాణి పరాణి - ఇన్ద్రియములు గొప్పవి
ఇన్ద్రియేభ్యః మనః పరమ్ - ఇన్ద్రియములకు కన్నా గొప్పది మనస్సు
మనసః తు బుద్ధిః పరా- మనస్స్సుకన్న పెద్దది బుద్ధి.
బుద్ధే పరతః - బుద్ధికన్నా గొప్పది
యః తు సః ( అత్మా) ఆహుః - ఏదో అదే ఆత్మ.

||శ్లోకతాత్పర్యము||

కోరికలను అణగదొక్క లేక మానవుడు పాపకార్యములకు కట్టుబడుతున్నాడు ! అది ఎలా అణగదొక్కాలి అంటే, ఒక చిన్న సూత్రము చెపుతాడు కృష్ణుడు.
ఇన్ద్రియాణి పరాణి- ఇంద్రియములు గొప్పవే శరీరము కన్నా
ఇన్ద్రియేభ్యః పరం మనః - ఇంద్రియములకన్నా గొప్పది మనస్సు.
మనసస్తు పరా బుద్ధిః - మనస్సు కన్న గొప్పది బుద్ధి
బుద్ధేః పరతః సః - బుద్ధి కన్న గొప్పవాడు వాడు అంటే ఆత్మ.
బుద్ధి మనస్సు చేత ఇంద్రియములను అరికట్టి అదుపులో వుంచవచ్చు అని.

||శ్లోకము 43||

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా |
జహి శత్రుం మహాబాహో కామరూప దురాసదమ్ || 43||

స|| హే మహాబాహో ! ఏవం బుద్ధేః పరం ఆత్మానం బుద్ధ్వా ఆత్మనా ( వివేకబుద్ధ్యా) ఆత్మానం సంస్తభ్య దురాసదమ్ కామరూపమ్ శత్రుం జహి || 43||

||శ్లోకార్థములు||

ఏవం బుద్ధేః పరం ఆత్మానం బుద్ధ్వా - ఈ విధముగా బుద్ది కన్నగొప్పదైన ఆత్మని తెలిసికొని
ఆత్మనా ( వివేకబుద్ధ్యా) ఆత్మానం సంస్తభ్య - ఆ వివేక బుద్ధిచేత మనస్సును అరికట్టి
దురాసదమ్ కామరూపమ్ శత్రుం జహి- జయింపశక్యముకాని కామరూపముగల శత్రువును జయించుము

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధముగా బుద్ది కన్నగొప్పదైన ఆత్మని తెలిసికొని, ఆ వివేక బుద్ధిచేత మనస్సును అరికట్టి,
జయింపశక్యముకాని కామరూపముగల శత్రువును జయించుము." ||43||

అలాంటి అత్మ గొప్పదని గ్రహించి అత్మద్వారా మనస్సుని ఇంద్రియములను అదుపులో ఉంచి అప్పుడు
"మహాబాహో కామరూపం శత్రుం జహి "!
ఓ మహాబాహో ! కామరూపముగల శత్రువును జయింపుము !(3.43)

ఈ విధముగా కృష్ణుడు కర్మయోగమును అర్జునినికి బోధిస్తాడు.

అధ్యాత్మిక మార్గమున కర్మమార్గము జ్ఞానమార్గము రెండు ముఖ్యమైన అనుష్టాన విధములు .
మన దైనందిక కర్మలన్నియు ఫలాపేక్ష లేక భగవదర్పిత భావముతో చేసినచో
మనము కర్మబంధములో చిక్కు కొనకుండా ఉండగలము

లేకపోతే కామ్య కర్మ వలన పరిమిత ఫలములను పొందుచూ,
జనన మరణ చక్రములో తగుల్కొని మోక్షమునకు దూరము అవుతాము.

బాహ్యవిషయములందు ఇంద్రియములను సంచరింపనీయక
అంతర్ముఖ మొనరించిన కోరికలు తగ్గించి ఇంద్రియ నిగ్రహము పొందగలుగుదుము.

మనస్సును ఫలాసక్తిగల ఆ విషయముల నుండి మరలించి
భగవంతుని యందు ఆత్మ యందు స్థిరపరచవలెను.

ఏ కార్యము చేసినను నేను చేసితిని అను అహంకారమును విడచి
నాలోగల దైవ శక్తి వలన ఈ కార్యము జరిగినది అని తలచుకొని
ఫలితమును కృష్ణార్పణమస్తు అనుకుంటూ భగవదర్పణము గావింప వలెను.

ఒక వ్యక్తి ఇష్టము లేకున్ననూ పాప కార్యములు చేయుచుండుటకు కారణమేమి?
అని అర్జునునికు కలిగిన సందేహమే మనలో చాలా మందికి కలుగుచుండును.

దొంగతనము చేయకూడదను విషయము
దోంగకి కూడా బాగుగా తెలియును కాని
దొంగతనము చేయచునే ఉన్నాడు.

అనగా అతని పూర్వ జన్మ సంస్కారముల బలముచే
అట్టి కార్యములను చేయు చున్నాడు.
వాటి నుండి తప్పించు కొనలేకపోతున్నాడు.

ఎటువంటి పని చేయుచున్ననూ ,
ఆపనికి సంబందించిన కామమే కారణము.
అనగా కోరికయే కారణము.
ఆ కోరికకు రజో గుణమే కారణము.
రజోగుణము ఒక వ్యక్తి లో ఎక్కువ ఒక వ్యక్తిలో తక్కువగ యుండుటకు పూర్వజన్మ సంస్కారములు కారణము .
మరి ఆ సంస్కారముల నుండి తప్పించు కొనవీలు లేదా? అని ప్రశ్న వచ్చును.

ఈ జన్మలో గల విచక్షణాజ్ఞానముతో దొంగతనము చేయకూడని పని,
నేను చేయను అని నిర్ధారించు కొని ఆ చెడు కర్మ నుండి బయపడవచ్చును.
తనంతట తాను ఆ నిర్ణయము తీసుకొనలేని స్థితిలో యుండినచో
పెద్దల వద్దకు వెళ్ళి వారి సందేశమును అనుసరించి మంచి మార్గము లోనికి మరల వచ్చును.

అట్లు మంచిమార్గము లోనికి మరలిన వారికి దేవతలు తోడుగా ఉంటారు.
అంతేకాదు అటు వంటి భక్తులు తనకెంతో ప్రియమని భగవంతుడే స్వయముగా చెప్పుచున్నాడు.

ఓమ్
ఇతి భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మ విద్యాయామ్ యోగ శాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగోనామ
తృతీయోఽధ్యాయః |

||ఓమ్ తత్ సత్ ||

 

 

 

 

 

.

 

|| ఓమ్ తత్ సత్ ||

శ్రీభగవానువాచ
ఏవం బుద్ధేః పర బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా|
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్||
"ఓ అర్జునా ఈ విధముగా బుద్ధి కన్నా అతీతమైనదానిని గా ఆత్మను ఎరిగి
బుద్ధిచేత మనస్సును అరికట్టి కష్టసాధ్యమైన కామము అనబడు శత్రువును జయింపుము"

||ఓమ్ తత్ సత్ ||

___________________________________________________


||ఓమ్ తత్ సత్ ||